Friday, November 22, 2024

జ్వరేవ్‌కు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్

- Advertisement -
- Advertisement -

Zverev won Cincinnati Masters Title

సిన్సినాటి: జర్మనీ సంచలనం, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో జ్వరేవ్ 62, 63తో ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా)ను ఓడించాడు. యూఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా పరిగణించే ఈ సిన్సినాటి ఓపెన్‌లో టైటిల్ సాధించడం ద్వారా జ్వరేవ్ తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నాడు. వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్‌గా కూడా పరిగణించే ఈ టోర్నీలో జ్వరేవ్ ఆరంభం నుంచే అసాధారణ ఆటతో చెలరేగి పోయాడు. టైటిల్ సాధించే క్రమంలో అలవోక విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో కూడా రష్యా స్టార్ రుబ్లేవ్‌కు కనీసం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. దూకుడుగా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేశాడు. అతని ధాటికి రుబ్లేవ్ ఎదురునిలువలేక పోయాడు. చూడచక్కని షాట్లతో అలరించిన జ్వరేవ్ ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు.

తర్వాతి సెట్‌లో కూడా జ్వరేవ్ దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. ఇక జ్వరేవ్ ధాటికి రుబ్లేవ్ తట్టుకోలేక పోయాడు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న రుబ్లేవ్ వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన జ్వరేవ్ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జ్వరేవ్‌కు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. అంతకుముందు టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో జ్వరేవ్ స్వర్ణం సాధించాడు. యూఎస్ ఓపెన్‌కు ముందు లభించిన ఈ రెండు విజయాలు జ్వరేవ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇదే జోరును యూఎస్ ఓపెన్‌లోనూ కనబరిచి టైటిల్‌ను ఎగురేసుకు పోవాలనే పట్టుదలతో జర్మనీ సంచలనం జ్వరేవ్ ఉన్నాడు.

Zverev won Cincinnati Masters Title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News