కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెగుసరాయ్: తరచూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సారి విధి నిర్వహణలో అలసత్యం ప్రదర్శించే అధికారులపై కొరడా ఝళిపించారు. ప్రజల గోడు పట్టించుకోని అధికారులను వెదురు కర్రలతో మోదాలంటూ తన నియోజకవర్గ ప్రజలకు సూచించారు. శనివారం బెగుసరాయ్‌లోని ఖోడావాండ్‌పూర్‌లో ఉన్న అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ ప్రభుత్వ అధికారిఎవరైనా సరే మీ ఇబ్బందులను పట్టించుకోకపోతే వెదురు కర్రతో బాదండి. మనమేమీ అధికారులను అక్రమ పనులు చేయమనో, నట్న నృత్యాలుచేయమనో అడగడం లేదు. చిన్నచిన్న పనుల కోసం ప్రజలు నా వద్దకు రావలసిన అవసరం లేదు. ఎంపిలు, ఎంఎల్‌ఎలు, విలేజ్ ముఖియాలు, డిఎంలు, ఎస్‌డిఎంలు, బిడిఓలు తదితర అధికారులున్నారు. వీరి పని ప్రజా సేవ చేయడమే.
వారు మీ మాటలు వినకుంటే రెండు చేతుల్లో వెదురు కర్రలు తీసుకుని వాళ్ల తలపై బలంగా మోదండి’ అని సింగ్ పేర్కొన్నారు. అప్పటికీ అధికారులు మాట వినకుంటే స్వయంగా తానే ప్రజలకు అండగా నిలుస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలపై పాట్నాలో పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ బిజెపి నాయకుడు స్పందిస్తూ ‘ గిరిరాజ్ సింగ్ ప్రజల ఆగ్రహానికి స్పందించే ప్రజా నాయకుడు. ఆయన వ్యాఖ్యలను మనం అలంకారికంగా చూడాలే తప్ప అక్షరరూపంలో కాదు’ అని అన్నారు.