Monday, December 23, 2024

ఊరు తెలంగాణ భాష తెలంగాణ

- Advertisement -
- Advertisement -

డా. మామిడి హరికృష్ణ రాసిన కావ్యం ఊరికి పోయిన యాళ్ళ ఇది ఎవరికైనా తమ తమ పుట్టిన ఊళ్ళకు తీసుకుపోతుంది. నిక్కరు వేసి బడికి పంపిన అమ్మను జ్ఞాపకం చేస్తుంది ఊరు. వాడ వాడల ఉన్న ఆయా కులస్తులను చూపిస్తుంది. మట్టిలో ఆడుకొని బురదలో పరాశికం అడటాన్ని గుర్తుకు తెస్తుంది. పండుగల కాలాన్ని కళ్ళకు చూపుతుంది. ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద పట్నాల్లో ఉంటున్నప్పటికి, ఏవో సంఘటనలు బాల్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి.అప్పుడనిపిస్తుంది ఊరికి ఒక సారి పోయి రావాల్నని. బడి, గుడి, పొలం, చేను చేల్క, చెట్టు చేమ మనసు విప్పి పల్కరించి బాల్యపు స్వర్గానికి తీసుకొని పోయి జ్ఞాపకాల అమృతం తాగించి సాగనంపుతాయి. దాంతో పునర్యవ్వనంతో పట్నంలో మళ్ళీ కాలుపెడుతాం. మొదటి కంటే మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. ‘ఊరికి పోయిన యాల్ల ‘కావ్యం 1995 నుండి 2017 వరకు వేర్వేరు సందర్భాలలో రాసిన వేర్వేరు కవితలతో ఉంది.

ఇందులోని కవితా వస్తువులు రెండు దశాబ్దాల తెలంగాణ ప్రాంత జీవన ప్రస్థానాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ, మానసిక, సాంస్కృతిక పరిణామాలను తెలియపరుస్తాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమానికి పూర్వం రాసిన కవితలలో కవితా వస్తువు తెలంగాణ సామాజిక – సాంస్కృతిక బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ఇక ఉద్యమం ఊపందుకున్న తర్వాత రాసిన కవితలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బలంగా మనకు వినిపిస్తుంది.ఇలా కవితా వస్తువులలో వైవిధ్యత ఉన్నప్పటికీ తెలంగాణ జీవితం అనే ఏకసూత్రత ఈ కవితలన్నిటిలో కొనసాగుతుంది. ఈ కావ్యంలో నుంచి నేను రెండు కవితలను ఎంపిక చేసుకొని ఈ వ్యాసంలో విశ్లేషించడానికి పూనుకున్నాను. అవి : 1)ఊరికి పోయిన యాళ్ళ, 2) బుగులోని తీర్థం. ఈ రెండు కవితలు ఈ కావ్యంలో తలమానికంగా ఉండటమే కాక తెలంగాణ ప్రజల మానసికస్థితిని వ్యక్తీకరించేలా ఉండటం నన్ను ఆకట్టుకుంది.
ఊరికి పోయిన యాళ్ళ
ఈ కవి తన ఊరికి పోయ్యాడు. పోబుద్ది అయి పోయాడు. ఎందుకు పోబుద్ది అయిందో చెప్తున్నాడు. ఊరికి పోవడం అంటే / ఊరికే పోవడం కాదు/ ఊపిరి కోసం పోవడ మంటాడు./ పట్నంలో నివాసం, ఉద్యోగం, నిన్నటి పనులే నేడు, పని ఒత్తిడి, పై అధికారుల ఆజ్ఞలు, తక్షణమే చేయాలన్న ఒత్తిడి, బాగా చేసి బాసును మెప్పించాలని ఆరాటం ఇట్లా చేస్తుండటమే, ఒక్కోక్క సారి ఊపిరాడనంత పని, మళ్ళీ ఊపిరి తీసుకొంటే తప్ప ఇంకా ఏ మాత్రము ఉత్సాహంగా పని చేయలేని స్థితి కలుగ వచ్చు, ఊపిరికోసం ఊరికి పోతాడట..
గతి తప్పకుండా ఉండటం కోసం ఊరికి పోవడం అంటాడు. గతి తప్పటానికి ఈ పట్నం ఏంమాయ చేస్తుందో తెలియదు. గతి తప్పుతానేమో; అని ఆలోచన వల్ల మబ్బు తునక లాగా ప్రత్యక్షమవుతుంది. ఎటు వెళ్ళాలి? ఊరెళ్ళాలనిపించి పోయానంటాడు.
చిరిగిన నెక్కర్ లోని బాల్యాన్ని ఒడిసి పట్టుకోవడానికి వెళ్ళుతాడట. నెక్కర్ వేసుకొనే వయసు పది పన్నెండేండ్లు, గడి, గడిలో బడి, బడిలో బాదం చెట్టు, ఆ చెట్టు కింద బడిపంతులు చెప్పిన పాఠాలను వొడిసి పట్టుకోవటానికట, ఊరికి పోయేది, చెట్టు నుండి రాలిన తరగతి పాఠాలనటం ఆ పాఠాలకు కవితా గంధమద్దటమే.ఊరు, ఊళ్ళో మంచి నీళ్ళ బావి, బొక్కెన్లతో ఆ నీటిని తోడుకొనే ఊరి జనం. ఈ అంశాన్ని సోపతిగాళ్ళ జ్ఞాపకాలను పొందుపరుస్తున్నాడు. కవితాత్మకంగా, మంచి నీళ్ళ బాయిలోంచి సోపతిగాల్లజ్ఞాపకాలని బొక్కెనల కొద్ది చేదుకోవడమే నీళ్ళ స్థానంలో ‘జ్ఞాపకాలను’ చేర్చాడు.

ఊళ్ళోకి వెళ్ళాడు ఊళ్ళో అనేక కుల వృత్తుల వాళ్ళు, మంగలి, మేర, కంచరి, కుమ్మరి – మొదలైన వాళ్ళు, వీళ్ళు జ్ఞాపకానికి వచ్చారనటం లేదు కుల వృత్తి పరికరం గుర్తోస్తుందంటాడు.మంగలి సమ్మయ్య కత్తెరనీ/ మేర మధుసూదన్ మిషిన్ నీ / కంచరి రాజయ్య నిప్పుల కొలిమిని / కుమ్మరి ఓదెల మట్టి కుండని / శాల నరసక్క ఆసుకొయ్యని / సదా నందం మొగ్గం గుంటని …../ ఆయా కుల వృత్తుల పరికరాలతో పాటు వారి వారి పేర్లనూ చెప్తున్నాడు, ఇది ఆయా వ్యక్తులను గౌరవించటం, ఆయా వృత్తి పరికరాలు తెలంగాణ పల్లెల జీవన విధానాన్ని తెలియజేస్తున్నాయి. అది, ఈ కవి బాల్యం నాటి విషయాలు ఇవి జ్ఞాపకానికి వస్తున్నాయి! వాటిని జ్ఞాపకంచేసుకోవటానికే ఊరికి వెళ్ళుతున్న తప్ప ఊరకే కాదంటున్నాడు మడతలు పడ్డ మస్తిష్కంలోంచి మళ్ళీ వెలికి తీయ టానికట. కూనపెళ్ళి రామయ్య మార్కండేయ పురాణాన్ని జ్ఞాపకం తెస్తుందన్న మాట సంస్కృతికి అద్దం పడుతుంది. పురాణాలు, హరికథలు పూర్వకాలం లో గ్రామీణులకు ఒక బుద్దిని, సంస్కారాన్నిచ్చేవి. పురాణాలను చదువగల వారు చదువుతారు. చదువనివారు చదివిన వారు చెప్పగా వింటారు. ఊరి ప్రజలు జ్ఞానం కలవారన్న విషయాన్ని ఈ అంశం సూచిస్తుంది.

అడుగు పెట్టే పెట్టగానే ఊరి మట్టిని దేహం నిండా పులుముకొని, ఆ మట్టి బురదని అత్తరులా అంగీ పై చల్లు కొంటాడట, ఊరి మట్టి మీద ఎంత ప్రేమ! బురదను అత్తరంటున్నాడు, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ పట్నంలో ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఊరిని మరువనంటున్నాడు. చెట్టు వలె ఎదిగినప్పటికీ, చెట్టు వేళ్ళుచేసిన, చేస్తున్న మేలును మరవనంటున్నాడు. వేళ్లకు బలం ఇచ్చే మట్టినీ మరువనంటున్నాడు.నేనిప్పుడు నిలువుగా ఎదిగిన చెట్టుని/ మబ్బులదాకా ధ్వనిస్తున్న ఆకు పాటని/ చిటారు కొమ్మలో కూచుని ఉన్నా/ చెట్టు వేళ్ళ లోనే బతికి పోతాను / మట్టి ములాలలోనే ఒదిగి పోతాను./ చెట్టు ఎదిగింది ఎంత ఎత్తు? మబ్బుల దాకా, చంద్రమండలాన్ని తాకిన మేడలని, ప్రబంధ కవులు వర్ణించిన విషయం గురొస్తుంది. కదలే ఆకుల చప్పుడును ‘పాట’ అంటున్నాడు. ఆకు చప్పుడును పాటగా భావించటం ఈ కవి సంగీత మెరిగిన లక్షణాన్ని, కవితా హృదయాన్ని తెలుపుతుంది.ఊరికి రావడ మంటే/ ఊరికే రావడం కాదు/ Buss pass, Pass port, Visa లను Renew చేసుకున్నట్లు పాస్ పోర్ట్, వీసాలు విదేశీయానానికి సంబంధించినవి విదేశాలకేగ కలిగినంత ఎత్తు ఎదిగినాడన్న విషయం సూచింపబడింది.

ఊరికి రావడం అంటే నా Identity ని మళ్ళీ పొడగించి కోవడం అంటాడు.ఊరి భాషలోనే ఊరిని వర్ణించటం ఈ కవితలోని మరొక ప్రత్యేకత, తెలంగాణను గురించి వర్ణిస్తూన్నారు, తెలంగాణ భాషను కూడ ఒడిసి పట్టుకొన్నాడీ కవి.
యాళ్ళ, చాయి, సోపతిగాళ్ళు, బొక్కెన, ఆసుకొయ్య, మొగ్గం గుంట, గొర్రెల కొట్టం, చేపల బండ, డప్పుల సప్పుడు, నెమలీకల కట్ట, బొంబాయి మిటాయ్, మొలతాడు దారం, జమిడీక సప్పుడు, పట్టాబుక్కు, పొగచూరు మొదలైన పదాలు తెలంగాణ వాతావరణాన్ని చిత్రిస్తూ మనల్ని మన మన ఊళ్ళను తలచుకొనేటట్టు చేస్తున్నాయి.
బుగులోని తీర్థం
ఒక దేవునికి సంవత్సరానికొకసారి ప్రత్యేక పూజాదులు జరుపబడుతుంటాయి వీటిని బ్రహ్మోత్సవాలంటారు. ఊరి ప్రజలకు తెలిసిన మాట ‘తీర్థం’ జరుగటం అక్కడక్కడ ప్రభావం గల దేవుళ్ళు శివుడు, విష్ణువు, అమ్మవారు కొందరు దేవతలను కొందరు తమ ఇలవేల్పుగా కొలుస్తుంటారు. ఆపదకు, సంపదకు దేవుణ్ణి తలచుకుంటారు. మొక్కుకుంటారు. ముడుపులు కడుతుంటారు. మొక్కు తీర్చుకుంటారు. ప్రతి యేట జరిగే ఈ తీర్థానికి వెళుతుండటం తెలంగాణ ఊళ్ళల్లో కనిపించే దృశ్యం. ఇది ఇంటి పండుగగా జరుపుకుంటారు. ఒక పెండ్లి కార్యం వలెనే హడావిడి. పండుగకు శోభనిచ్చేది బంధువుల రాక, బంధువులను పండుగకు పిల్చుకుంటారు.ఇంటిల్లిపాది పిల్లా జెల్లా, సుట్టాలు తీర్థం పోతారు. ఆ దేవునికి స్నానాదులు చేసి మొక్కుకుంటారు. ముడుపులు చెల్లించుకుంటారు. ఈ మొక్కులు కాగానే భోజనాలు మాంసాదులు తినటం, కల్లు వగైరా తాగటం వగైరా – (ఈ కవి తన కులంలో,

తన ఇంట్లో జరిగే భోజనాదుల విశేషాలను దాపరికం లేకుండా రాశాడు) ఆ రాత్రి నిద్రచేసి, మరుసటి రోజు ఉదయం బయల్దేరి రాత్రి వరకు ఇల్లు చేరటం – ఇత్యాదిగా జరిగే తీర్థ యాత్రను ఈ ‘కవి బుగులోని తీర్థం’లో వర్ణించాడు. ఈ తీర్థాన్ని ఒక యాత్రా చరిత్రగా చిత్రించాడు. బయలు దేరటం, గమ్యాన్ని చేరుకోవటం, తిరిగిరావటం.పాల్కురికి సొమనాథుడు పండితారాధ్య చరిత్రము రాశాడు. ఇందులో అయిదు విభాగాలు. చివరిది పర్వత ప్రకరణము, భక్త సమూహాలు శివరాత్రి నాటికి శ్రీశైలం చేరుకొన్న విషయాలు వర్ణింపబడినాయి. దారి వర్ణనలున్నాయి. మజిలీలు ఆయా ప్రాంతాల్లోని భక్తుల స్వాగత సన్నాహాలు, శ్రీశైలం చేరుకొని శివరాత్రి నాడు జరిగే ఉత్సవంలో పాల్గొనటం, శివదర్శనం, ఉత్సవ విశేషాలు, ఆటపాట, తిరిగి రాక, ఇది తెలుగులో రాయబడిన మొదటి యాత్రా చరిత్ర. ఈ యాత్రను తలపిస్తుంది, ఈ బుగులోని తీర్థం.

తీర్థం పోవుడంటే/ భక్తి రక్తి మిళాయించిన / ఓ ప్రయాణ పండుగ./ అటు దైవ భక్తి కొబ్బరికాయలు కొట్టటం వగైరా ../ బుగులెంక గుహ దగ్గరికి పోయి / దండాలు పెట్టి, కొబ్బరి కాయలు కొట్టి / పసుపు కుంకుమల బొట్టుపెట్టి / మొక్కులు అప్పజెప్పుతం / గుండె నిండ భక్తిని నింపుకొని / కండ్ల నిండ దేవున్ని సూసి/ తప్పులు కాయమని చెంపలేసుకొని / వచ్చే ఏటికి అంతా మంచే చెయ్యమని / దేవునికి ముడుపులు కడతం/ దీనికి మందు గుండంలో మూడు మున్కలేస్తారు భక్తులు. ఇది ఒక దశ మరొక దశ ఇంటికి చేరుకొన్న తరువాత తెచ్చిన ప్రసాదాలను అందరికీ పంచటం. ఈ పంచటం లో ఒక నిష్ఠ, ఒక పద్ధతి.
అమ్మ, బాపమ్మ, చిన్నమ్మలు / నిష్టగ తలకు నీళ్ళు పోసుకొని తానాలు చేసి / కొత్త చీరలు కట్టుకుంటరు / బుగులోని తీర్థం పలారాలను/ పేపర్ ల పొట్లాల లెక్కకడ్తరు / ఉళ్ళే అందరి ఇండ్లల్లకుపోయి / ముత్తయిదుల కాళ్ళకు పసుపు రాసి/ పలారం పొట్లాలను అందరికీ పంచుతరు / ఇది కవి చేసిన భక్తి వర్ణన./

తీర్థం పోవుడంటే …./ ఓ ప్రయాణ పండుగ అన్నాడు/ ఇది కవి చెప్పిన ‘రక్తి’ కి సంబంధించిన అంశం! ఆనందం! ప్రయాణం లో పలు దశలు. ప్రయాణారంభయత్నాలు. ఊళ్ళల్ల ఉన్న చుట్టాలను పిల్చుకోవటం మా ఇంట్ల ఓ పెండ్లి చేసినట్టే అంటాడు – తీర్థం పోవటంఅంటే. పెండ్లికి బంధువులకు పిలుపు వలె తీర్థానికి బంధువులు వాహనం ఎడ్ల బండి, బండికి వడ్ల, కమ్మరి వారితో బాగు చేయించటం, పసుపు కుంకుమలతో బండినలంకరించటం, ఎండ తగులకుండ వెదురు బద్దలు, చెద్దర్లు వేసి గుడారం వలె వేయటం, స్వామి దర్శనానంతరం తినటానికి వంట సామాన్లు, కోళ్ళు, గొర్రెలు ఇవి ప్రయాణపు ఏర్పాట్లు , తీర్థం జరిగేది జంజిరాల పున్నంనాడు. రెండు రోజుల ముందే ప్రయాణం పగలు, రాత్రి త్రయోదశి వెన్నెల, జిగేలు మనే కాంతి, ఎడ్ల గిట్టల చప్పుడు. వీటి మెడలోని గజ్జెల చప్పుడు, బండి కింద విరిగి పడిన చెట్లు, ఎండిన కొమ్మల చప్పుడు, బండ్లోకూచున్న వారి అచ్చట్లు ముచ్చట్లు /

ఆకాశం త్రయోదశి ఎన్నెల వెండిపూతల జిగేల్ జిగేల్ / మట్టిబాట మీద ఎద్దుల కాలి గిట్టెల టకేల్ టకేల్ / గంగడోలు మీద గజ్జెల ఘల్ ఘల్ / బండి గీరెల కింద ఎండు కొమ్మలు విరిగిన / చిట్ పట్ చట్ పట్ లో / బండి లోపల మనుషుల అచ్చట్లు ముచ్చట్లు/ ప్రయాణంలో ఒక రోజు రాత్రి, దారిలో ఉన్న బంధువుల ఇంట్లో విడిది ఆ ఇంటి వాళ్ళు చూపిన ఆప్యాయత / మా ఊరు నుంచి మైలారం దాటి / కొప్పులకు పొయ్యేటాలకు చీకటి పడేది / అక్కడ మా తాత సుట్టాల ఇంట్ల రాత్రి విడిది / సంవత్సరాని కొక్కసారి కలుత్తామని/ బౌపానంగ మర్యాదలు, ముచ్చట్లు.ఇది ప్రయాణం ఆ పిదప తీర్థం చేరుకొన్నాక మ్రొక్కులు, అక్కడ విడిది, తీసుకుపోయిన కోళ్ళు, గొర్రెల మాంసం తిని, తాగటం అక్కడ జరిగే పని, ఇది కవి వర్ణించిన బుగులు వేంకటేశ్వర స్వామి తీర్థ యాత్ర వర్ణన. నాటి కాలపు పరిస్థితులను కళ్ళకు కట్టించే వర్ణన.ఇలా మామిడి హరికృష్ణ తన ఊరికి పోయిన యాళ్ళ కవితా సంకలనంలో 30కవితలను గుది గుచ్చి అందించారు. ఈ కవితలన్నీ తెలంగాణ భాషను యాసగా కాకుండా భాషగా నిలబెట్టే స్థాయికి ఉదాహరణలుగా నిలుస్తాయి. మట్టి భాషకు అక్షరాభిషేకం చేసిన ఈ కావ్యాన్ని ఆయన తన తల్లి గారైన శ్రీమతి స్వరాజ్యంకు అంకితం ఇవ్వడం కవికి తన మాతృభక్తికి ఉదాహరణ మాత్రమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News