Monday, January 20, 2025

కాకతీయ వర్శిటీకి దక్కిన గౌరవం

- Advertisement -
- Advertisement -

మన రాష్ట్రంలో రెండవ అతి పెద్ద, ఉత్తర తెలంగాణకే ఉన్నత విద్య, పరిశోధనలలో తలమానికంగా ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయం వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం నేడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్ధులకు ఉన్నత విద్య, పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తూ జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తూ 47 వసంతాల కాకతీయ యూనివర్శిటీ నేడు మరొక మైలురాయిని సాధించింది. రాష్ట్రంలో సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో చారిత్రక యూనివర్శిటీ అయిన కాకతీయ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిజి డిప్లొమా, వృత్తి విద్య, పరిశోధన కోర్సుల్లో విద్య అందిస్తోంది. ఇటీవల జాతీ య స్థాయిలో న్యాక్ ఏ ప్లస్ గ్రేడు సాధించి, నేడు ఉస్మానియా యూనివర్శిటీ తర్వాత న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన రెండో యూనివర్శిటీగా నేడు తెలంగాణలో ఉన్నత విద్యలో తలమానికంగా, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సేవలు అందిస్తున్న కాకతీయ యూనివర్శిటీ దక్కిన ఒక గౌరవం. నాలుగో సారి న్యాక్ గుర్తింపు వెళ్లిన కాకతీయ యూనివర్శిటీ ఈ గ్రేడ్ సాధించడం వల్ల అడ్మినిస్ట్రేషన్, అధ్యాపక బృందం, విద్యార్థి బృందం నేడు హర్షిస్తున్నది. గతంలో కూడా మంచి గ్రేడ్ పొందింది.
ముఖ్యంగా న్యాక్ పర్యటన ముందే వర్శిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, మౌలిక వనరుల అభివృద్ధి, నూతన భవనాలు, పలు నూతన అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పరిచారు. అందులో విద్యార్థినుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ఐటిడిఎ సౌజన్యంతో మహిళా వసతి గృహం, ప్రధాన పరిపాలన భవనంలో రెండో అంతస్తు నిర్మాణం, వసతి గృహంలో డైనింగ్ హాల్ ఏర్పాటు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు, కాకతీయ హబ్, ఇతర మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేశారు. ఇంకా కొన్ని అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. పివి విజ్ఞాన పీఠం, ఎంబిఎ భవన నిర్మాణం, పలు నూతన వసతి గృహాల ఏర్పాటు, మొదటిసారిగా దివ్యాంగుల కోసం అత్యాధునిక వసతులతో హాస్టల్లాంటి అభివృద్ధి పనులు, పలు ప్రతిపాదనలు చేశారు. ఇవి న్యాక్ గుర్తింపులో కీలకంగా మారాయి. పరిశోధన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వ కళాశాలలను పరిశోధన కేంద్రాలుగా ఏర్పాటు చేసి పి.హెచ్.డి ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి 34 ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా జరిగాయి.ఓ రకంగా ఇవి కూడా ఉన్నత గ్రేడ్ సాధించడంలో దోహదపడ్డాయి. ఇంగ్లాండ్‌లోని వేల్స్ విద్యాలయంతో ఐదు రంగాల్లో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ సాధీ ప్రాజెక్టులో వరంగల్ నీట్‌తో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూముల గుర్తింపునకు కమిటీ ప్రకారం వర్శిటీ చుట్టూ ప్రహరీ నిర్మాణం ప్రాధాన్య అంశంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంతో పాటు, విశ్వవిద్యాలయ వనరుల నుంచి రూ. 10 కోట్లు సమీకరించి వర్శిటీ భూములు కాపాడాలని కృషి చేస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ సర్వే ద్వారా భూముల హద్దులు గుర్తించి, అన్యాక్రాంతమైన భూములని కాపాడాలని వర్శిటీ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుంది. విద్యార్ధులకు ప్రాంగణ నియామకాల్లో ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఎక్కువ శాతం నియామకాలు జరిగి, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. కాకతీయ యూనివర్శిటీ జాతీయ స్థాయిలో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించడంలో విశ్వవిద్యాలయ పరిపాలన బృందం, ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు నిరంతర కృషి వల్లే ఈ విజయం సాధ్యమైనది. ఈ గుర్తింపు వల్ల యూనివర్శిటీలో నూతన కోర్సులని ప్రవేశపెట్టవచ్చు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది, ఎక్కువ నిధులు వస్తాయి, దూర విద్యా కేంద్రానికి కొత్త కోర్సులు ప్రవేశపెట్టి బలోపేతం చేయవచ్చు. నేడు జాతీయ స్థాయిలో ప్రసిద్ధి గాంచిన కాకతీయ యూనివర్సిటీ నిధుల కొరత, అధ్యాపకుల ఖాళీలు, ఇతర రెగ్యులర్ సిబ్బంది లేక ఇంకా కొన్ని సమస్యలతో సతమతమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను కేటాయించి, విద్యా, పరిశోనలకు కావాల్సిన అన్ని జాతీయ స్థాయి సౌకర్యాలను మరిన్ని ప్రవేశపెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ యూనివర్శిటీ ఈ జాతీయ గుర్తింపు పొందిన సందర్భంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేధావులు అభిప్రాయం. భవిష్యత్తులో కాకతీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఇలాంటి ఉన్నత గ్రేడ్లు, ఇతర జాతీయ గుర్తింపులు కాకతీయ విశ్వవిద్యాలయం పొంది, మన తెలంగాణ విద్యార్ధులను ప్రపంచ స్థాయిలో ముందుంచే దిశగా కృషి చేస్తుందని ఆశిద్దాం.

– డా. శ్రవణ్ కుమార్ కందగట్ల, ఫోన్: 8639374879.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News