చెన్నై : తమిళ టైగర్ , ఎల్‌టిటిఇ నేత ప్రభాకరన్ చనిపోలేదని, ఆయన జీవించే ఉన్నారని ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి వైగో ఆదివారం సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆదివారం ప్రభాకరన్ జన్మదినం అని, తాము ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బర్త్‌డేను జరిపినట్లు తెలిపారు. ఎల్‌టిటిఇ నేత ప్రభాకరన్ జీవించే ఉన్నారని ఆయన త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఈ నేత చెప్పారు. ప్రభాకరన్ జీవించి ఉన్నట్లు ప్రముఖ రాజకీయ నాయకులు పజా నెదుమరన్ ఈ ఫిబ్రవరిలో తెలిపారు.
ఆయన, గతంలో ప్రభాకరన్‌తో కలిసి తిరిగిన వారు నిజాలే చెపుతారని వైగో స్పష్టం చేశారు. ప్రభాకరన్‌కు ఏమీ కాలేదని, త్వరలోనే ఆయన తిరిగి వస్తారనే విషయం చెప్పడం తమిళులకు ఆనందం కల్గిస్తుందని చెప్పిన వైగో ఆయన గురించి తలెత్తే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు దొరుకుతాయని చెప్పారు. ప్రత్యేక తమిళదేశం ఏర్పాటు గురించి త్వరలోనే ఆయన వెల్లడిస్తారని కూడా వైగో చెప్పడం సంచలనం అయింది. 2009 మే 18న శ్రీలంక అంతర్యుద్ధం తీవ్రత దశలో తమిళ టైగర్ ప్రభాకరన్‌ను తాము మట్టుపెట్టినట్లు అప్పటి శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.