న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజోత్ సింగ్ సిధు అనూహ్యంగా మంగళవారం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. “పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం విషయంలో నేను ఎప్పుడూ రాజీపడను. అందువల్లనే నేను రాజీనామా చేస్తున్నాను” అంటూ ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘రాజీపడను’అన్న విషయంలో ఆయన వివరణ ఏదీ ఇవ్వలేదు.
నవజోత్ చాలా తక్కువ కాలంపాటే ఆ పదవిలో ఉన్నారు. ఆయనకు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు మధ్య ఇటీవల వైరం రాజుకుంది. మనస్పర్ధలు చోటుచేసుకున్నాయన్నది ఇక్కడ గమనార్హం. ఇదిలా ఉండగా అమరీందర్ సింగ్ తర్వాత తన పేరును ముఖ్యమంత్రి పదవికి పరిశీలించకపోవడం వల్లనే ఆయన నిరాశకు గురయ్యారని జనులు అనుకుంటున్నారు.
అమరీందర్ సింగ్ ఢిల్లీకి వచ్చిన మరునాడే నవజోత్ సింగ్ సిధు రాజీనామా చేశారు. అమరీందర్ సింగ్ హోంమంత్రి అమిత్ షాను కలుసుకుంటారని ఊహాగానాలున్నాయి. అయితే ఇది ఇంకా ధృవీకరించబడలేదు.
అయితే పేరు చెప్ప నిరాకరించిన ఓ బిజెపి నాయకుడు ఒకరు “అమరీందర్ సింగ్, అమిత్ షా మధ్య సమావేశం ఉండగలదు, ఆ దిశలో అడుగులు పడుతున్నాయి” అని తెలిపారు.