Wednesday, January 22, 2025

పతన ఆర్థిక సూచీలు

- Advertisement -
- Advertisement -

Cooperative federalism is partially in vogue

ఎన్నికల వల్ల గాని, ఇతర అనేక కారణాల వల్ల గాని దేశంలో రాజకీయం పెరుగుతున్నంతగా ఆర్థికాభివృద్ధి కృషి జరగడం లేదు. ప్రజలను పీడిస్తున్న అనేక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్న సూచనలు కనిపించడం లేదు. ఇందుకు వేలెత్తి చూపించవలసింది దేశాన్నేలుతున్న పాలకులనే తప్ప వేరెవ్వరినీ కాదు. వారికి కార్పొరేట్ రంగం పట్ల వున్న మక్కువ ఓట్లు వేసి తమకు అధికారం కట్టబెట్టిన 130 కోట్లకు మించిన ప్రజానీకం మీద లేదు. ఈ విషయం అతి తరచుగా రుజువవుతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన 2022-23 ఆర్థిక సంవత్సర సాధారణ బడ్జెట్ ఇందుకు తిరుగులేని నిదర్శనం. అందులో ప్రజలపై భారాన్ని పెంచడానికే ఆమె ప్రాధాన్యమిచ్చారు గాని, తగ్గించాలన్న దృష్టి బొత్తిగా కనిపించలేదు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)కి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి కేటాయింపులను భారీగా తగ్గించి వేశారు. ఎఫ్‌సిఐ కేటాయింపుల్లో రూ. 65 వేల కోట్ల మేరకు భారీ కోత విధించారు. మధ్యాహ్న భోజన పథకానికి, సమగ్ర బాలల అభివృద్ధి పథకానికి కూడా నిధులను గతంలో కంటే తక్కువగా కేటాయించారు.

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 25 వేల కోట్ల మేరకు నిధులు కోసేశారు. 2021 డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి రేటు 0.4 శాతానికి పడిపోయింది. అంతకు ముందరి నవంబర్ మాసంలో 1.3 శాతంగా రికార్డయిన రేటు ఇంతగా పతనం కావడం అప్పటికి పది మాసాల కాలంలో ఇదే మొదటిసారని, అత్యధమమని నిపుణులు నిగ్గు తేల్చారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య జనం జీవితాలతో క్రూర పరిహాసం సాగిస్తున్నాయి. 2021 నవంబర్‌లో 4.91 శాతంగా వున్న చిల్లర ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్‌లో 5.66 శాతానికి పాకిపోయింది. ఆహార సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నూనెల ధరలు 18.70 శాతం పెరిగాయి. మాంసం, చేపల ధరలు 5.45 శాతం, కూరగాయలు 5.19 శాతం, పప్పులు 3.02 శాతం ఎగబాకాయి. ఏ దేశ ఆర్థిక పరిస్థితి అయినా దాని ఎగుమతి, దిగుమతులలోనే ప్రతిబింబిస్తుంది. ఇతర దేశాలకు మనం చేసే ఎగుమతులు మన ఉత్పత్తి రంగానికి వున్న గిరాకీని రుజువు చేస్తాయి.

అలాగే మన అవసరాలకు ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతుల్లో మన ఆర్థికరంగ బలహీనత ప్రస్ఫుటమవుతుంది. ఎగుమతుల విలువ తక్కువై దిగుమతుల విలువ ఎక్కువగా వున్నప్పుడు అది మన వాణిజ్య లోటును ప్రతిబింబిస్తుంది. దానిని తొలగించుకొని మన దేశంలో తయారయ్యే సరకుల మీద ఇతర దేశాలు అమితంగా ఆధారపడేలా చేసుకోగలిగినప్పుడే మంచి ఆర్థికాభివృద్ధిని సాధించుకోగలుగుతాము. అది దేశంలో నిరుద్యోగాన్ని తొలగించి ప్రజలను సుభిక్షంగా వుంచగలుగుతుంది. ఈ విషయంలో మన చరిత్ర ఘనమైనదేమీ కాదు. దేశంలో ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజెల్‌లో దాదాపు 80 శాతం దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ మీదనే ఆధారపడి వుంది. అంటే విదేశీ మారకద్రవ్యం వెచ్చించి అంతర్జాతీయ మార్కెట్‌లో వుండే ధరను బట్టి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకొని దేశీయ అవసరాలను సంతృప్తి పరచుకుంటున్నాము. ఇంకా అనేక కీలక రంగాల్లో మనం దిగుమతుల మీదనే ఆధారపడుతున్నాము. ఏ పాలకులైనా తమ హయాంలో ప్రజలు బాగున్నారని చెప్పుకోవాలంటే దిగుమతులపై ఆధారపడి బతికే స్థితి నుంచి దేశాన్ని బయటపడవేసినప్పుడే అది సాధ్యమవుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు చేసిన వాగ్దానాలు పారిశ్రామిక వృద్ధి రేటును పెంచడానికి మేకిన్ ఇండియా లాంటి పథకాలను ప్రకటించి వాటి గురించి చెప్పుకున్న ప్రగల్భాలు తెలిసినవే. కాని వాస్తవంలో అవేవీ రుజువు కాలేదు. 2022 జనవరిలో మన ఎగుమతులు 25.28 శాతం పెరిగి వాటి విలువ 34.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే అదే సమయంలో దిగుమతులు కూడా 23.54 శాతం పెరిగాయి. అంతకు ముందున్న వాణిజ్య లోటుకు తోడై అది 17.43 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021 ఏప్రిల్ 2022 జనవరి మధ్య ఎగుమతులు 46.73 శాతం పెరిగి వాటి విలువ 335.88 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ ఇదే సమయంలో దిగుమతులు 62.65 శాతం పెరిగిపోయి వాటి విలువ 495.75 బిలియన్ డాలర్లు అయింది. ఆ మేరకు వాణిజ్య లోటు 159.87 బిలియన్ డాలర్ల వద్దకు చేరుకున్నది. ఈ కాలంలో క్రూడాయిల్ దిగుమతులు 26.9 శాతం పెరిగాయి. దిగుమతులు భారీగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒక్క సర్వీసుల రంగంలోనే ఎగుమతులు ప్రోత్సాహకరంగా వున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు దేశ ఆర్థికాభివృద్ధి కృషి పట్ల బిజెపి పాలకులు చూపిస్తున్న శ్రద్ధ శూన్యమని రుజువవుతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News