Monday, December 23, 2024

ప్రభుత్వ భూములు మావే

- Advertisement -
- Advertisement -

ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతాలలో 163వ జాతీయ రహదారి ఏర్పాటు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండడంతో భూములకు రెక్కలు రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక శాతం ప్రభుత్వ భూములు అటవీ భూములు ఉన్నాయి. ఎన్నో ఏండ్ల తరబడి భూమిని నమ్ముకొని సాగు చేసుకుంటు జీవనం గడుపుతున్న దళిత గిరిజనులు ఇతర పరంపరాగత నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. అమాయక గిరిజనులకు బినామీలుగా ఏర్పాటుచేసుకొని కొన్ని శక్తులు నిరుపేద గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చిచ్చు పెడుతున్న బడా బాబులు ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ భూములన్ని మావే అంటు నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూములపై కన్నేసి సాగు భూములు గుంజుకుంటు ఎల్‌టిఆర్ నోటీసులు పంపించి భయబ్రాంతులకు గురిచేస్తూ గుడిసెలు వేసే ప్రయత్నాలు చేస్తూ ఇరుపక్షాల వాదనలు ఏజెన్సీ ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఏజెన్సీ ప్రాంతాల నుండి నిరుపేద గిరిజనేతరులు వెళ్లిపోవాలని వాదనలు తారాస్తాయికి చేరుకుంటున్నాయి. గిరిజనులు గిరిజనేతల మధ్య పాలకులు చిచ్చు పెడుతూ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పాలకుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

గతంలో ఐటిడిఏ పిఓగా విధులు నిర్వహించిన గౌతమ్ ఓ గిరిజన సంఘానికి సర్వే నెంబర్ 209లో 125 ఎకరాల సాగులో ఉన్న చెరువు శిఖం ప్రభుత్వ భూమిని తమకు పట్టా ఇచ్చారని ఆదివాసీ నాయకులుగా చలామణి అవుతున్న కొంతమంది కబ్జాదారులు అమాయక గిరిజనులకు లేనిపోని ఆశలు చూపి, భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని బహిర్గతంగానే ఒకరిపై ఒకరు సంఘాల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో హార్ట్ టాపిక్‌గా మారింది. ఎన్నో ఏండ్లు మండల కేంద్రానికి చెందిన గంజి సాంబశివరావు సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటుచేసుకొని ఇంకా కొంతమంది మిగులు భూమిని ఆక్రమించుకొని తమ ఆదీనంలో ఉంచుకొని సంఘ నాయకులు ఇతర ప్రాంతాలు భూపాలపల్లి, రొయ్యూరు, రామన్నగూడెం, గోవిందరావుపేట షాపెల్లిలకు చెందిన గిరిజనేతరులకు ఇతర వలస గిరిజనులకు గుంటకు ఆరు లక్షల చొప్పున అమ్మకాలు జరిపి భూ దందాలకు పాల్పడడం వివాదాలకు దారి తీయడం జరుగుతుంది.
తెర వెనుక ఉద్యోగుల పాత్ర: ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమించడంలో కొంత మంది ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ విభాగాలలో పనిచేస్తున్న పెద్ద సార్ల కనుసన్నల్లోనే కొంత మందికి కింది స్థాయి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అమాయక వలసవాద గిరిజనులను ఉసిగొలిపి భూములను ఆక్రమించుకొని కమిషన్లు దండుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. 209 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించిన కుటుంబాలు మొత్తం ఎన్ని ఉన్నాయి. అందులో స్థానికులు ఎన్ని కుటుంబాలు, వలసవాద కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. గిరిజనేతర కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. నిజ నిర్ధారణ చేసుకోవడం కోసం జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టినట్లయితే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆయా ప్రజా సంఘాల నాయకులు దానిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మా భూములకు రక్షణ కల్పించండి : కొన్నెల్లుగా మా తాత ముత్తాతల కాలం నుండి భూమిని నమ్ముకొని జీవనం గడుపుతున్న మా భూములకు రక్షణ కల్పించి ఆదుకోవాలని మండల కేంద్రానికి చెందిన ఉట్నూరు బిక్షపతి, సమ్మయ్యలు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు సాగు చేసుకుంటున్న భూమి వద్ద ఆదివారం గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏటూరునాగారం మండలంలోని భూటారం, ముళ్లకట్ట గ్రామానికి చెందిన కొంత మంది గిరిజనులు ధౌర్జన్యంగా తాం సాగు చేస్తున్న భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తమకు ఇంకా చావే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమ భూమికి రక్షణ కల్పించి తమను కాపాడాలని కోరారు.

వలస వాదులను తరిమికొట్టే విధంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రజా సంఘాలు ఏకం చేసి దశల వారీగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. భూములలో గుడిసెలు వేసే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో విషయం తెలుసుకున్న స్థానిక సిఐ మండల రాజు, ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌లు తమ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించి ఎలాంటి ఘర్షణలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News