Tuesday, January 21, 2025

ప్రియాంక గాంధీ జైలులో కలిసి తన తండ్రి చావు గురించి ప్రశ్నించింది: నళినీ శ్రీహరన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ జైలులో నన్ను కలిసి తండ్రి చావు గురించి ప్రశ్నించింది. ఆమె అప్పుడు చాలా భావోద్వేగానికి గురై తన దుఃఖాన్ని కూడా ఆపుకోలేకపోయిందని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళినీ శ్రీహరన్ తెలిపింది. ఆమె చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపింది. మన దేశంలో జీవిత ఖైదు శిక్షను అత్యధిక కాలం అనుభవించిన ఖైదీ నళినీ శ్రీహరన్. సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వుల మేరకు ఆమెను వెల్లూరు జైలు నుంచి శనివారం విడుదలచేశారు. ఆమెతో పాటు మిగతా ఆరుగురు నిందితులను కూడా విడుదలచేశారు.

తిరుచి స్పెషల్ క్యాంప్‌లో ఉన్న తన భర్తను కూడా విడుదల చేయాలని ఆమె తమిళనాడు ప్రభుత్వాన్ని అర్థించారు. ఆమె సోమవారం తన భర్తను కలుసుకోడానికి తిరుచ్చి వెళ్లనున్నారు. తన కూతురు విదేశాల్లో ఉందని, తాను తమిళనాడులోని కొన్ని ప్రదేశాలను చూడాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రధానంగా కీశే. కమలా సర్ మెమోరియల్‌ను చూడాలనుకుంటున్నానని తెలిపింది. తన భర్తను విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నళినీ కోరింది. తాను ఈ కేసు నుంచి విముక్తి పొందడానికి కారణమైన అందరినీ కలుసుకోవానుకుంటున్నట్లు కూడా తెలిపింది. “నేను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కలుసుకుని కృతజ్ఞతలు తెలుపాలనుకుంటున్నాను. అంతేకాక నేను రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు అవకాశం ఇస్తే వారిని నేను కలుసుకుంటాను” అని కూడా నళినీ శ్రీహరన్ తెలిపింది. జైలు జీవితం గుర్తు చేసుకుంటూ…ఖైదీలను మరణదండనకు గురైన వారిని చూసేంత నీచంగా చూస్తుంటారు. రెండు నెలల గర్భంతో ఉన్న నన్ను కూడా జైలులో బంధించి ఉంచారు.

నళినీ తన భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడుతూ…“ నా కుటుంబం నాకు ప్రధానం. నేను ఇక ఏ వృత్తి చేయబోను. నా జీవితం నాశనమైపోయింది. నేనిక నా కుటుంబ జీవితానికే అంకితమైపోతాను” అని తెలపింది. నళినీతో పాటు రవిచంద్రన్, రాబర్ట్ పయస్, జయకుమార్, ఎస్.రాజా, శ్రీహరన్ కూడా రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులే. రవిచంద్రన్‌ను మదురై సెంట్రల్ జైల్ నుంచి విడుదలచేశారు. నళినీ సహా ఆరుగురు ఖైదీలను సత్ప్రవర్తన కారణంగా సుప్రీంకోర్టు జైలు నుంచి విడుదలచేసింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే 21న తమిళనాడులోని పెరంబదూర్‌లో ఎల్‌టిటిఈ ఆత్మాహుతి బాంబర్ కారణంగా హత్యకు గురయ్యారు. ఆ కేసులో నళినీ శ్రీహరన్, ఆర్‌పి రవిచంద్రన్, జయకుమార్, శంతన్, మురుగన్, రాబర్ట్ పయస్, ఏజి పెరారివాలన్ అనే ఏడుగురికి మరణశిక్ష పడింది. తరువాత నళినీ శ్రీహరన్ శిక్షను జీవిత ఖైదు శిక్షగా మార్చారు. ఆ తర్వాత మిగతా ఆరుగురి శిక్షను కూడా తగ్గించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత 2014లో ఆ ఆరుగురిని ఈ కేసు నుంచి విడుదలచేయాలని సిఫారసు కూడా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News