న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛ లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలపై న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఎన్నికైన ప్రధానమంత్రిని కూడా వారు అడ్డు అదుపులేకుండా విమర్శించారని పేర్కొన్నారు. “ప్రజాభిమానం పొందిన ప్రధానమంత్రిని ఇష్టమున్నట్లు, పరిమితులు లేకుండా మాట్లాడే వ్యక్తులు భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఏడుస్తున్నారు! వారు కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ గురించి ఎప్పుడూ మాట్లాడరు, కొంతమంది ప్రాంతీయ పార్టీ సిఎంలను విమర్శించే ధైర్యం కూడా చేయరు” అన్నారు. మాజీ న్యాయమూర్తి శ్రీకృష్ణ ‘నేషనల్ డైలీ’ కి చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం దేశంలో భావస్వేచ్ఛ కరువైంది.
ఈ రోజు పరిస్థితులు “బాగా లేవు” అని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీకృష్ణ అన్నారు. “నేను బహిరంగ కూడలిలో నిలబడి, ప్రధానమంత్రి ముఖం నాకు ఇష్టం లేదని చెబితే, ఎవరైనా నాపై దాడి చేసి, నన్ను అరెస్టు చేసి, ఎటువంటి కారణం చెప్పకుండా నన్ను జైలులో పడవేయవచ్చు. ఇప్పుడు దానిని పౌరులుగా మనమందరం వ్యతిరేకిస్తాం” అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అన్నారు.