Saturday, November 16, 2024

మేవానీ అరెస్టు!

- Advertisement -
- Advertisement -

Bulldozers crash into livelihoods at jahangirpuri

నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మహాత్మా గాంధీని, వల్లభభాయ్ పటేల్‌ను తన ప్రియతమ జాతీయ నాయకులుగా ప్రకటించుకున్నది. ఆర్‌ఎస్‌ఎస్ ఆశ్రమంలో తాము అమితంగా ఆరాధించినవారి ప్రస్తావన తీసుకు రాకుండా వీరిద్దరినీ ఆదర్శ పురుషులుగా చెప్పుకుంటున్నది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర బొత్తిగా లేని బిజెపి, కాంగ్రెస్ పార్టీ సారథులైన గాంధీల కుటుంబ పెద్ద, ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను బద్ధ శత్రువుగా చూస్తున్నది. అయితే గాంధీ జీ పట్ల బిజెపి ప్రదర్శించే భక్తి భావంలోని నిజాయితీ తరచూ బోనెక్కుతుంటుంది. అహింసనే పరమాయుధంగా ధరించి రక్త రహిత ఉద్యమం ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముని నిరాయుధ సిద్ధాంతానికి విరుద్ధంగా ముస్లిం మైనారిటీలు, దళితులను బిజెపి, దాని అనుబంధ శక్తులు హింసాత్మకంగా అణచివేయడం, హతమార్చడం, అత్యాచారాలకు గురి చేయడం, గో రక్షణ పేరిట వారిపై తీవ్ర దాడులకు పాల్పడడం, అవమానపర్చడం తరచూ చూస్తున్న కఠోర సత్యాలే. ఇటువంటి దారుణ ఘటనలను దేశాధినేతగా ప్రధాని మోడీ బాహాటంగా ఖండించిన సందర్భం లేకపోడమే ఆచరణలో వారి గాంధీ భక్తిలోని డొల్లతనం స్పష్టపడుతుంది. గాంధీని ప్రేమించేవారు ఆయనను ద్వేషించేవారిని నిరసించాలి కదా! కాని అందుకు విరుద్ధంగా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేనే కీర్తించేవారు బిజెపిలో ఉన్నత పీఠాల్లో వుంటారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంపి సాధ్వీ ప్రజ్ఞాసింగ్ టాకూర్ ఇంచుమించు గతంలో గాడ్సేను దేశభక్తుడుగా కీర్తించారు. అప్పుడు బిజెపి పెద్దలుగాని, చిన్నలు గాని ఆమెను ఖండించలేదు. ఇప్పుడు గాడ్సేపై ప్రతికూల ట్వీట్ చేశారన్న కారణంపై గుజరాత్‌లోని వడ్గామ్ నియోజక వర్గ దళిత ఎంఎల్‌ఎ జిగ్నేశ్ మేవానిని అసోం పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోడంలో బిజెపివారి గాంధీ భక్తి ఎటువంటిదో మళ్లీ రుజువైంది. గాంధీని చంపిన గాడ్సేను ద్వేషించడం సహేతుకమవుతుంది గాని, ఆయనను దేశభక్తుడిగా కీర్తించడం ఎలా మంచి పని అవుతుందో అర్థం కాని విషయం. అంటే బిజెపి, దాని అనుబంధ శక్తులు వాస్తవంలో గాంధీని వ్యతిరేకిస్తూ గాడ్సేను ఆరాధిస్తున్నారని అర్థమవుతున్నది. గాడ్సే దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది అనో, గాడ్సేను ప్రధాని మోడీ దేవుడుగా పరిగణిస్తారనో వ్యాఖ్యానించినందుకు, బోడో లాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ కార్యవర్గంలోని బిజెపి సభ్యుడు అరుప్ కుమార్ డే అసోంలోని కొక్రాజర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని దానితో గుజరాత్‌లోని మేవానిని అరెస్టు చేసి తీసుకుపోయారని వార్తలు చెబుతున్నాయి. దేశంలో చట్టం పాలకులను వ్యతిరేకించేవారిపై విచక్షణా రహితంగా విరుచుకుపడుతున్నదని మరోసారి మరింత దారుణంగా రుజువైంది. రాజకీయ నాయకులు అనుదినం ఒకరిపై ఒకరు చేసుకునే వ్యాఖ్యలకు వారిని అరెస్టు చేయడం మొదలుపెడితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్క నాయకుడు కూడా మిగలకుండా పోతారు. జిగ్నేశ్ మేవాని ఇండిపెండెంటుగా గెలిచిన గుజరాత్ ఎంఎల్‌ఎ, ఆయన కాంగ్రెస్ పట్ల తన మక్కువను ప్రకటించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీదే పోటీ చేస్తానని వెల్లడించారు. అరెస్టు చేసే ముందు ఆ విషయం ఆ వ్యక్తికి నోటీసు ద్వారా తెలియజేయడం నేర తీవ్రతను నిర్ధారించి అరెస్టు అవసరం ఏల కలిగిందో ఎరుక పరచడం ప్రజాస్వామ్య మర్యాద. బిజెపి పాలనలో అటువంటి మర్యాదలేమీ లేవని తాము వ్యతిరేకించేవారిని ఏదో ఒక కేసులో ఇరికించి కటకటాలపాలు చేయడానికి వారు వెనుకాడరని అనేక సందర్భాల్లో రుజువైంది. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వేచ్ఛకు దేశంలో నిలువ నీడ లేకుండా పోయిందని స్పష్టపడుతున్నది. ఎదిరించే, ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ధ్యేయంగా బిజెపి పరిపాలన సాగిస్తున్నది. రాజ్యాంగం పౌరులకిచ్చిన సకల హక్కులనూ, స్వేచ్ఛలనూ హరించడం ద్వారా దేశంలో మత రాజ్యాన్ని స్థాపించాలని వారు కోరుకుంటున్నట్టు వెల్లడవుతున్నది. వీరి పాలనలో పోలీసుల ధోరణి కుక్క కంటే దాని తోక ఎక్కువగా ఊగుతుందనే సామెతను రుజువు చేస్తున్నది. పాలకులను సంతృప్తి పరచడానికి మన పోలీసులు వారిలో వారు పోటీపడుతుంటారు. అసోం పోలీసులు ఇందులో అగ్ర స్థానంలో వున్నారు. మొన్న ఏప్రిల్ 20 నాడు రాత్రి పదకొండున్నర గంటలకు అసోం పోలీసులు గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు వచ్చి అక్కడున్న మేవానిని అరెస్టు చేసి హుటాహుటిన మర్నాడు మధ్యాహ్నానికి కొక్రాజర్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. రాష్ట్రాల సరిహద్దులు దాటుకొని ఎక్కడికైనా వెళ్లిపోయి నిందితులను అరెస్టు చేసి తీసుకెళ్లడం, తమకు గిట్టనివారిని కష్టాల్లోకి నెట్టడంలో వారికి ఏ చట్టమూ అడ్డురాకపోడం చివరికి న్యాయ స్థానాలు కూడా వారి అండ నిలవకపోడం దేశంలో దట్టంగా కమ్ముకుంటున్న చిమ్మచీకటిని రుజువు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News