కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీకి అనుకూల వాతావరణం
విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలందరూ మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీని బలపర్చాలనే ఆలోచనతో ఉన్నారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం కనపడుతోందన్నారు. ఆదివారం ఆ పార్టీ చేపట్టే విజయ సంకల్ప యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ రాకముందే దేశ ప్రజల్లో ఒక స్పష్టమైన ఆలోచన కనపడుతుతోందని, మరోసారి బిజెపి సర్కారు రావాలని, మూడోసారి ప్రధాని మోడీ కావాలని ప్రజలు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నరని కనపడుతోందన్నారు. ఆయన నాయకత్వంలో గత రెండుసార్లు బిజెపికి మెజారిటీ పెరిగిందని, మూడోసారి లోక్ సభ ఎన్నికల్లో ప్రజల నుంచి మరింత మెజారిటీ కట్టబెట్టేలా సానుకూల వాతావరణం కనపడుతోందన్నారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఏర్పడేలా తెలంగాణ ప్రజలు భాగస్వామ్యమయ్యేలా, ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, ప్రజల ఆశీస్సులు తీసుకోవడం కోసం రాష్ట్ర శాఖ 5 బస్సు యాత్రలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
యాత్ర 5 ప్రాంతాల్లో ప్రారంభమవుతుందని.. ఒక్కో క్లస్టర్ లో నిర్వహించే యాత్రకు ఒక్కో పేరు..
కొమురం భీం యాత్ర -1 : ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు.
శాతవాహన యాత్ర -2 : కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలు.
కాకతీయ యాత్ర -3 : ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్.
భాగ్యనగర యాత్ర -4 : భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి.
కృష్ణమ్మ యాత్ర -5 : మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ.
ఇది రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండలాల్లో కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్ర ప్రతిరోజు 2 నుంచి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించబడుతుంది. ప్రతి మండల కేంద్రంలో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రోడ్ షోలు ఉంటాయన్నారు. యాత్రలో పార్టీ ముఖ్య నాయకులు బహిరంగ సభల్లో, రోడ్ షోలలో పాల్గొంటారని, ప్రతి యాత్రలో అన్ని వర్గాలకు సంబంధించిన, ముఖ్య నాయకులు హాజరైతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ , మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి ,దుగ్యాల ప్రదీప్ కుమార్, శిల్పా రెడ్డి, ఎన్వీ సుభాష్ , రాణి రుద్రమ తదితరులు పాల్గొన్నారు.
#WATCH | Hyderabad: On Vijay Sankalp Yatra, Telangana BJP chief G Kishan Reddy says, "…Vijay Sankalp Yatra will pass through all 17 parliament constituencies, 33 districts and more than one crore of people will be outreached. We'll seek their support for our PM Narendra… pic.twitter.com/XR44lFY7Ze
— ANI (@ANI) February 11, 2024