Wednesday, January 22, 2025

స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌పై సర్వత్రా ఆసక్తి..

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్ధి ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డా తాటికొండ రాజయ్య కు అధిష్టానం తిరిగి టికెట్ ఇస్తుందా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. నాలుగు దఫాలుగా బిఆర్‌ఎస్ పార్టీ స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు తిరిగి టికెట్ దక్కుతుందా లేదా అనే విషయంపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ లేపుతుంది. ఇప్పటికే ఎవరిని ఎంపిక చేయాలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ శ్రేణులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంచితే రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయారంగేట్రం చేశాడు. 1999లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయ్యారు.

2008 ఉప ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూశారు. మూడో సారి 2009లో జరిగిన ఎన్నికల్లో రాజయ్య కడియంపై 11,600 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన లక్షంగా కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పటి తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. తెలంగాణా వాదం బలంగా ఉన్న సమయంలో అప్పటి తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న కడియం శ్రీహరిపై టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న రాజయ్య 32,638 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయరామారావుపై 58,829 ఓట్ల మెజార్టీతో గెలుపోందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరపై 35,790 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి నాలుగవ సారి ఎమ్మెల్యే అయ్యారు.

రాజయ్యకు కెసిఆర్ సముచిత స్థానం
ప్రత్యేక రాష్ట్ర నినాదంతో ఉద్యమ పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చిన అప్పటి టిఆర్‌ఎస్ (ఇప్పుడు బిఆర్‌ఎస్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెసిఆర్ తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. తొలి మంత్రివర్గంలోనే రాజయ్యకు సముచిత స్థానం కల్పించి డిప్యూటీ సిఎం హోదాతో పాటు వైద్య ఆరోగ్యశాఖను కట్టబెట్టారు. ఈ క్రమంలో స్వైన్ ఫ్లూతో 22 మంది మృతిచెందడం, అంబులెన్స్‌ల కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో రాజయ్యను డిప్యూటి సిఎం హోదాతో పాటు మంత్రి పదవి నుంచి తొలగించారు.
 రాజయ్య స్థానంలో కడియంకు డిప్యూటి సిఎం హోదా
2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన కడియం శ్రీహరి 2104 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే పార్టీ నుంచి గెలుపొంది ఎంపి అయ్యారు. 2015లో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియంను సిఎం కెసిఆర్ డిప్యూటీ సిఎంగా నియమించారు.

కడియం డిప్యూటి సిఎం కావడంతో వర్గ పోరుకు బీజం
కడియం శ్రీహరికి డిప్యూటి సిఎం పదవి రావడంతో రాజయ్యకు సన్నిహితులుగా ఉన్న పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందే వరకు వర్గ బేధాలు లేకుండా ఉన్న పార్టీ శ్రేణులు కడియం డిప్యూటి సిఎం అవడంతో వర్గాలుగా చీలడం ఆరంభమైంది. రాను రాను ఇద్దరు నేతల మధ్య కూడా సఖ్యత లేకుండా పోయింది. అంతర్గతంగా వైరం నెలకొన్నా కొద్ది రోజుల వరకు బహిర్గతం కాకుండా ఉన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కొంత మంది సర్పంచ్‌లు, ఎంపిటిసిలు నిధుల కేటాయింపుల్లో ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న కారణంతో కడియంకు చేరువయ్యారు. తనకున్న ఎమ్మెల్సీ నిధులను తన అని వచ్చిన వారికి నిధుల మంజూరు ఇచ్చిన కడియం వారిని దగ్గరకు తీసుకున్నాడు. అభివృద్ధి పనుల విషయంలో ఎవరి అనుచరులు వారినే ఆహ్వానించి శంకుస్థాపనలు కావించడంతో వర్గపోరు తీవ్రమైంది. ఇద్దరు నేతల విషయంలో పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చిలికి చిలికి గాలి వాన అన్న చందంగా మారింది.

 అతని చేష్టలే రాజయ్యకు శాపమా ?
ఎమ్మెల్యే రాజయ్యలా ఉన్న గొంతుతో గతంలో ఓ మహిళతో ఫోన్‌లో అసభ్యంగా సంభాషించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా వార్తా పత్రికల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. అంతే కాకుండా ఓ పుట్టిన రోజు వేడుకల్లో కేక్‌తో ఉన్న ఎమ్మెల్యే వేలును మహిళా నాయకురాలు నోట్లో పెట్టుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఓ చిన్నారి విద్యార్ధినితో అన్నం తినిపించుకోవడం విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్యపై పలు ఆరోపణలు చేస్తూ మీడియాకు ఎక్కి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇవి చాలవన్నట్లు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజయ్య, కడియం మధ్య విభేధాలు పచ్చ గడ్డివేస్తే భగ్గుమనేలా తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో మండలంలోని హిమ్మత్‌నగర్‌లో కడియంపై రాజయ్య ఘాటుగా వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డాడు. కడియం తల్లి పద్మశాలి అని తండ్రి మాత్రం ఊహ అని వాఖ్యానించి రాజకీయ దుమారం లేపారు. విషయం వెంటనే అధిష్టానం దృష్టికి పోవడంతో త తర్వాత నుంచి సద్దుమణిగింది. అంతే కాకుండా పార్టీ పదవులు, అభివృద్ధి పనుల విషయంలో కమీషన్లు తీసుకుంటాడన్న అపవాదు ఎమ్మెల్యేకు ఉంది.

కడియంకు ఎమ్మెల్యే టికెట్ ఖరారైనట్టే !
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ తరపును ప్రస్థుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఓ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వనున్నట్లు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. దీంతో కడియం అనుచరగణంలో నిండైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. తమ నేతకు పార్టీ టికెట్ వస్తుందన్న ధీమా కనబరుస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు కడియంను సంప్రదిస్తున్నట్లు విశ్వనీయంగా తెలిసింది. ఇందులో పలువురు జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ఉన్నారు. ఇదంతా చూస్తుంటే దాదాపుగా కడియం శ్రీహరికి టికెట్ ఖారారైనట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే రాజయ్య పార్టీ మారుతాడా లేదా ఎమ్మెల్సీగా సర్దుకుంటాడా అన్నది అభ్యర్థుల ప్రకటన వెలువడే దాకా వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News